Crow : ఈ భూమి మీద ఉన్న అనేక జీవరాశుల్లో పక్షులు కూడా ఒకటి. మనం అనేక రకాల పక్షులను చూస్తూ వాటి అరుపులను వింటూ ఉంటాం. మన దేశంలో ఇతర పక్షుల కంటే కాకి కి, దాని అరుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాకి మన పితృ దేవతల ప్రతినిధి అని హిందూ ధర్మాలు తెలియజేస్తున్నాయి. కర్మలు చేసేటప్పుడు కాకి వచ్చి మనం పెట్టిన పిండాలను తింటేనే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని మనలో చాలా మంది గాఢంగా నమ్ముతారు. మన పూర్వీకులు కాకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారనే విశ్వాసం కూడా ఉంది.
వివిధ సందర్భాలలో కాకి ప్రవర్తించే తీరును బట్టి శుభ, అశుభ శకునాలు ఉంటాయని మన పెద్దలు నిర్ణయించారు. ఆ శకునాల గురించి, వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి మీద లేదా ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారని నమ్ముతారు. ఇంటి ముందు ఒక కాకి కాకుండా నాలుగైదు కాకులు ఆరుస్తూ ఉంటే ఏదో కీడు జరగబోతుందని సంకేతం. కాకి గనక ఎగురుతూ వచ్చి మన తలపై వాలితే ఏదో చెడు జరగబోతోందని, ప్రాణ భయం కూడా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.
కాకి మీద వాలిన వెంటనే తలస్నానం చేసి ఏమీ కాకూడదని ఇష్ట దైవాన్ని ప్రార్థించాలని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే మనం బయటకు వెళ్లునప్పుడు కాకి కుడి వైపు నుండి ఎడమ వైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుంది. ఒకవేళ కాకి గనక ఎడమ వైపు నుండి కుడి వైపుకు వస్తే అశుభం కలుగుతుంది. ఇలా కనుక జరిగితే వెంటనే ఇంట్లోకి వచ్చి కాళ్లు కడుక్కుని కొద్ది సేపు కూర్చొని మరలా బయటకు వెళ్లాలని శకున శాస్త్రం చెబుతోంది.