Palli Chutney : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా దోశ, ఇడ్లీ, వడ, ఊతప్పం, ఉప్మా వంటి రకరకాల పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వీటితోపాటు వీటిని తినడానికి చట్నీని కూడా తయారు చేస్తూ ఉంటాం. చట్నీ రుచిగా ఉంటేనే మనం చేసే పదార్థాలు రుచిగా ఉంటాయి. మనం చేసే చట్నీల్లో పల్లి చట్నీ కూడా ఒకటి. ఈ పల్లి చట్నీతో మనం ఎటువంటి అల్పాహారాన్ని అయినా తినవచ్చు. ఈ పల్లి చట్నీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, నూనె – అర టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిరపకాయలు – 6 లేదా తగినన్ని, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – 3 గ్రాములు, అల్లం – ఒక ఇంచు ముక్క, నీళ్లు – ఒక చిన్న గ్లాస్ లేదా తగినన్ని.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – అర టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ.
పల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత పల్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకుని వాటికి ఉన్న పొట్టును తీయాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక శనగ పప్పును, మినప పప్పును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిరపకాయలను వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను, చింతపండును, అల్లం ముక్కను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి అన్ని చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి.
ఇందులోనే ముందుగా వేయించిన పల్లీలను, తగినంత ఉప్పును కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను వేసి వేయించుకోవాలి. తాళింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న చట్నీ లో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి చట్నీ తయారువుతుంది. ఈ చట్నీని ఉదయం చేసే అన్ని రకాల అల్పాహారాలతోనూ కలిపి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.