Bottle Gourd Halwa : మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో సొరకాయ కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా సొరకాయలో కూడా శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. తరచూ సొరకాయను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం సొరకాయను పచ్చడిగా, కూరగా, పప్పుగా చేసుకుని తింటూ ఉంటాం. కేవలం ఇవే కాకుండా సొరకాయతో ఎంతో రుచిగా ఉండే హల్వా ను కూడా చేసుకుని తినవచ్చు. సొరకాయ హల్వా ఎంతో రుచిగా ఉంటుంది. చాలా సులభంగా సొరకాయ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ తురుము – రెండు కప్పులు, పంచదార – ముప్పావు కప్పు, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష – కొద్దిగా, జీడి పప్పు – కొద్దిగా.
సొరకాయ హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత ఎండు ద్రాక్ష, జీడి పప్పు వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సొరకాయ తురుమును వేసి చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత పంచదారను వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత పాలను పోయాలి. ఇప్పుడు మంటను మధ్యస్థంగా ఉంచి పాలు మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. పాలు మొత్తం దగ్గర పడిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ హల్వా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా త్వరగా, చాలా రుచిగా సొరకాయ హల్వా చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.