Puri : మనలో చాలా మంది ఇష్టంగా తినే అల్పాహారాల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని మనం అప్పుడప్పుడూ తయారు చేస్తూనే ఉంటాం. కొందరూ ఎంత ప్రయత్నించినా కూడా పూరీలను మెత్తగా, పొంగేలా తయారు చేసుకోలేకపోతుంటారు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మనం పూరీలను మెత్తగా, పొంగేలా.. అలాగే ఎక్కువగా నూనెను పీల్చుకోకుండా ఉండేలా తయారు చేసుకోవచ్చు. మెత్తగా ఉండేలా పూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కాచి చల్లార్చిన పాలు – అరకప్పు, నీళ్లు – రెండు లేదా మూడు టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పిండిని తీసుకుని అందులోనే బొంబాయి రవ్వను, ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత పాలను పోసి కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడానికి తగినట్టుగా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి కలుపుకోవాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పూరీ పిండి చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. తరువాత గిన్నెపై మూత ఉంచి అర గంట పాటు పిండిని నానబెట్టాలి.
తరువాత పిండిని మరోసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని తగిన పరిమాణంలో తీసుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి. ఇలా ముద్దలన్నీ చేసుకున్న తరువాత ఒక్కో ముద్దను తీసుకుంటూ కొద్ది కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా వత్తుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలన్నింటినీ వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి నూనెను బాగా వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీని వేసి వెంటనే నూనె లోపలికి వత్తాలి. ఇలా చేయడం వల్ల పూరీలు పొంగుతాయి. పూరీ పొంగిన తరువాత వెంటనే మరో వైపు తిప్పాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని.. పూరీలను టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి కానీ, ప్లేట్ లోకి కానీ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీలు పొంగడమే కాకుండా ఎక్కువగా నూనెను పీల్చుకోకుండా మెత్తగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.