Palak Paneer : మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో పాలు కూడా ఒకటి. పాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పాలతో చేసే పదార్థాల్లో పనీర్ కూడా ఒకటి. పాలలో ఉండే పోషకాలు అన్నీ కూడా పనీర్ లో ఉంటాయి. పనీర్ ను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దీంతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం.
పనీర్ తో చేసుకోదగిన వంటకాల్లో పాలక్ పనీర్ కూడా ఒకటి. పాలక్ పనీర్ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభమే. పాలక్ పనీర్ కూరను రెస్టారెంట్ లో చేసే విధంగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ పనీర్ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 4 కట్టలు (చిన్నవి), ముక్కలుగా చేసిన పనీర్ – 200 గ్రా., నూనె -3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం ముక్క- 2 ఇంచుల ముక్క (తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – 6, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), పెద్ద ముక్కలుగా తరిగిన టమాట – 1, సాజీరా – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, చిలికిన పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ క్రీమ్ – 2 టీ స్పూన్స్.
పాలక్ పనీర్ కూర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ముప్పావు గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక తరిగిన పాలకూరను వేసి పది నిమిషా పాటు ఉడికించాలి. తరువాత పాలకూరను ఒక జల్లిగంటెలోకి తీసుకుని నీళ్లు అన్నీ పోయేలా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక తరిగిన పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి అన్నీ కూడా చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ముందుగా ఉడికించిన పాలకూరను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక సాజీరా, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేయాలి. తరువాత వెంటనే మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి ముప్పావు కప్పు నీళ్లు పోయాలి. తరువాత ఉప్పును వేసి కలిపి మూత పెట్టాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పెరుగును వేసి కలిపి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పనీర్ ముక్కలను వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిపై ఫ్రెష్ క్రీమ్ ను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ పనీర్ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న పాలక్ పనీర్ ను రోటీ, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.