Guntha Ponganalu : ఉదయం అల్పాహారంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఈ ఇడ్లీ పిండిని రెండు మూడు రోజులకు సరిపడేలా ఒకేసారి తయారు చేసుకుని నిల్వ చేసుకుంటాం. ఈ విధంగా తయారు చేసుకున్న ఇడ్లీ పిండితో మనం ఇడ్లీలనే కాకుండా రుచిగా ఉండేలా గుంత పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో చేసే గుంతపొంగనాలు చాలా రుచిగా ఉంటాయి. ఇడ్లీ పిండితో గుంత పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుంత పొంగనాల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ పిండి – 2 కప్పులు, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, నీళ్లు – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, పసుపు – చిటికెడు.
గుంతపొంగనాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తరుము, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత ఒక చిన్న కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ఇడ్లీ పిండిలో వేయాలి. తరువాత ఇందులోనే పసుపును కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే అందులో నీళ్లను వేసి పలుచగా చేసుకోవాలి.
తరువాత స్టవ్ మీద గుంతపొంగనాలు తయారు చేసుకునే పాత్రను ఉంచి ఆ గుంతల్లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న పిండిని తగినంత మోతాదులో వేయాలి. తరువాత దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేడి చేయాలి. తరువాత పొంగనాలను మరో వైపుకు తిప్పి కొద్ది కొద్దిగా నూనె వేసి మరలా మూడు నిమిషాల పాటు కాల్చుకోవాలి. తరువాత ఈ గుంతపొంగనాలను ఒక ప్లేట్ లోకి లేదా గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ పిండితో ఎంతో రుచిగా గుంతపొంగనాలను తయారు చేసుకోవచ్చు.
ఈ గుంతపొంగనాలను నేరుగా లేదా పల్లి చట్నీ, టమాటా చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇడ్లీ పిండితో అప్పుడప్పుడూ ఇలా గుంతపొంగనాలను కూడా తయారు చేసుకుని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తీసుకోవచ్చు.