Memory Power : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఉరుకుల పరుగుల జీవితంతో సతమతవుతూనే ఉన్నారు. పనుల ఒత్తిడి, ఆందోళనల వల్ల ఇబ్బందిపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. మితిమీరిన ఆందోళనలు, ఒత్తిడి కారణంగా చాలా మంది జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు. కొన్ని రకాల వ్యాధులకు మందులు వాడడం, నిద్రలేమి, అధికంగా మద్యాన్ని సేవించడం, విటమిన్ బి12 లోపం, హైపో థైరాయిడిజం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యల వల్ల కూడా మనం జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటాం.
విద్యార్థుల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చదివిన విషయాలను కూడా వారు గుర్తుంచుకోలేకపోతున్నారు. అసలే ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకు రావాలంటే జ్ఞాపక శక్తి చాలా అవసరం. మతిమరుపు సమస్యలతో బాధపడే వారు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. జ్ఞాపక శక్తిని పెంచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జ్ఞాపక శక్తి పెరగాలంటే ముందుగా మనం చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే బాదం పాలను కూడా తాగాలి. జ్ఞాపక శక్తి వృద్ధి చెందాలంటే రోజూ ఆహారంలో కోడిగుడ్డును, ఒక గ్లాస్ బాదం పాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. మెదడు పనితీరును మెరుగుపరిచే అనేక పోషకాలను బాదం కలిగి ఉంటుంది.
ఈ బాదం పాలను రాత్రి పడుకునే సమయంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పాలను తాగలేని వారు రోజూ 6 నుండి 8 బాదం గింజలను నీటిలో ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజూ తినడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ మెదడులోని కణాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజూ బాదం పాలను తాగడం వల్ల లేదా నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల అల్జీమర్స్ సమస్య కూడా నయం అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
బాదం పాలను తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్తం పెరుగుదలలో కూడా బాదం పాలు ఉపకరిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవారు రోజూ ఆహారంలో కోడిగుడ్డును, బాదం పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.