Chepala Pulusu : చేపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేపలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలిసిందే. చేపల పులుసును మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వంటరాని వారు కూడా తయారు చేసుకునేలా చేపలతో రుచిగా పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – 750 గ్రా., జీలకర్ర – 2 టీ స్పూన్స్, ధనియాలు – 2 టీ స్పూన్స్, మెంతులు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 15, నానబెట్టిన చింతపండు – 50గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – 400 ఎమ్ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను రెండు సార్లు బాగా శుభ్రం చేయాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. అలాగే నానబెట్టిన చింతపండు నుండి వీలైనంతగా రసాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు వెడల్పుగా ఉండే కళాయిని తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాటాను ఫ్యూరీగా చేసి వేసుకోవాలి. టమాట గుజ్జు ఉడికిన తరువాత అందులో పసుపు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం వేసి కలపాలి. వీటన్నింటిని కూడా మరో రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి. తరువాత ఇందులో చింతపండు గుజ్జును, నీటిని పోసి కలిపి మరిగించాలి.
చేపల పులుసు మరిగిన తరువాత అందులో ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసి మూత పెట్టి ఉడికించాలి. వీటిని చిన్న మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. చేప ముక్కలు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో చేప ముక్కలను గంటెతో కలపకుండా గిన్నె మొత్తాన్ని కదపాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు చిదురవ్వకుండా ఉంటాయి. చేప ముక్కలు పూర్తిగా ఉడికిన తరువాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కమ్మటి రుచిని కలిగి ఉండే చేపల పులుసు తయారవుతుంది. ఈ చేపల పులుసును తయారు చేసిన 4 గంటల తరువాత తింటే మరింత రుచిగా ఉంటుంది.