Tomatoes For Pimples : మనలోచాలా మందిని వేధిస్తున్న చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఎండలో బయట తిరగడం, వాతావరణ కాలుష్యం, ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వాటిని మొటిమలు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. జిడ్డు చర్మం ఉన్న వారు కూడా ఈ మొటిమల సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. మొటిమలు రాగానే చాలా మంది కంగారు పడిపోయి వాటికి ఏవేవో క్రీములు రాయడం, ఫేస్ వాష్ లు వాడడం వంటివి చేస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.
అంతేకాకుండా ఇవి అధిక ధరలతో కూడుకుని ఉంటాయి. ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా మనం మన ముఖంపై వచ్చే మొటిమలను తొలగించుకోవచ్చు. మొటిమలను నివారించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక టమాట కాయను తీసుకుని మధ్యలోకి కట్ చేయాలి. ఇలా కట్ చేసిన టమాట ముక్కను తీసుకుని ముఖం, చేతులు, మెడ భాగాల్లో చర్మంపై బాగా రుద్దాలి. 10 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, జిడ్డు పోయి మొటిమలు తొలగిపోతాయి.
అదే విధంగా టమాటాను గుజ్జుగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు వేళ్లతో మర్దనా చేస్తూ రాయాలి. 30 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మొటిమల నుండి మనం ఉపశమనాన్ని పొందవచ్చు. ఇక మొటిమలతో బాధపడే వారు టమాట రసంలో నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచుతూ మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాయాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ చిట్కాలను తరచూ వాడడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు తొలగిపోతాయి.
అంతేకాకుండా ఈ చిట్కాలను వాడడం వల్ల కళ్ల చుట్టూ ఉండే నల్లని మచ్చలు, ముడతలు కూడా తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. ఈ విధంగా టమాట కాయలను ఉపయోగించి ఎటువంటి ఖర్చు లేకుండా ముఖంపై ఉండే మొటిమలను తొలగించుకోవచ్చు.