Okra For Skin And Hair : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. బెండకాయలతో చాలా మంది వేపుడు, కూర, పులుసు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే బెండకాయతో మనం మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బెండకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శిరోజాలను సంరక్షించడమే కాక.. చర్మాన్ని కూడా కాపాడుతాయి. వీటిని సంరక్షించుకునేందుకు బెండకాయలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు లేదా మూడు బెండకాయలను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. నీరు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి బెండకాయలను నీటిలో అలాగే ఉంచాలి. ఇలా 30 నిమిషాల పాటు ఉంచితే బెండకాయల్లో ఉండే జిగురు లాంటి పదార్థం ఆ నీటిలోకి చేరుతుంది. అనంతరం ఆ మిశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖంపై రాసి గంట సేపు అయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి.
పైన తెలిపిన విధంగా తయారు చేసిన బెండకాయ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా మారి ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు బలహీనంగా మారి చిట్లడం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇలా బెండకాయలు మన చర్మం, శిరోజాలను రక్షించేందుకు ఎంతగానో దోహదపడతాయి.
బెండకాయల్లో విటమిన్లు ఎ, బి, సి, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, మెగ్రిషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఫోలిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవన్నీ జుట్టుకు పోషణను అందిస్తాయి. కనుక జుట్టు సమస్యలు తగ్గుతాయి. అలాగే బెండకాయల్లో ఉండే రీ హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. దీంతో చర్మం పొడిబారదు. ముఖ్యంగా చలికాలంలో మనకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. కనుక ఈ సీజన్‌లో బెండకాయలను ఉపయోగించి మనం మన శిరోజాలు, చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.