Soan Papdi : పిల్లలు ఉన్న ఇల్లలో తల్లులు వారి పిల్లలకు చిరుతిల్లు లేదా స్నాక్స్ కోసం ఏం పెట్టాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అప్పుడప్పుడు బయట దొరికే పదార్థాలు కొని తెచ్చినా ఎల్లప్పుడూ అవి పిల్లలకు పెట్టడం అనారోగ్యకరం అవుతుంది. కొన్ని రకాల స్వీట్లను పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. వాటిలో సోన్ పాపిడి లేదా పీచు మిఠాయి ఒకటి. ఇది మన ఇల్లలో చేసేకంటే ఎక్కువగా బయట నుండి కొంటూ ఉంటాం. కానీ దీనిని మనం ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు సోన్ పాపిడి ని ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం.
సోన్ పాపిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
శనగపిండి- 50 గ్రాములు, మైదాపిండి- 75 గ్రాములు, పంచదార- 200 గ్రాములు, నిమ్మరసం- 4 లేదా 5 చుక్కలు , నెయ్యి- 4 టేబుల్ స్పూన్లు, నీళ్లు- పావు కప్పు, యాలకుల పొడి- 1 టీ స్పూన్, సన్నగా తరిగిన పిస్తా గింజలు- 1 టీ స్పూన్.
సోన్ పాపిడిని తయారు చేసే విధానం..
ముందుగా స్టవ్ పై ఒక కళాయిలో 2 స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో శనగపిండి వేసి వేయించాలి. అది కొంచెం వేగాక మైదా పిండి కూడా వేసి బాగా తిప్పుతూ మిగతా నెయ్యి కూడా వేసి పొడిగా అయ్యేలా వేయించాలి. ఒక జల్లెడ తీసుకొని వేయించిన పిండిలో గడ్డలు లేకుండా సన్నగా ఉండేలా జల్లెడ పట్టి దానిలో యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బాణలిలో చెక్కర వేసి దానిలో నీళ్లు పోసి తిప్పుతూ మరిగించాలి. దానిలో నిమ్మరసం కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి . చక్కెర పాకం బంగారు రంగు లోకి మారినప్పుడు పాకం తయారైనట్టుగా అనుకొని స్టవ్ మీదనుండి దించుకోవాలి. పాకం చల్లారిన తరువాత దానిని ఒక చదునుగా ఉండే ప్లేట్ మీదకు తీసుకొని రెండు చేతులతో సాగదీస్తూ దానిపై కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని చల్లుతూ ఉండాలి.
ఇదే విధంగా చాలా సార్లు సాగదీస్తూ పిండి మిశ్రమం అయిపోయేదాకా అలాగే చేస్తూ ఉండాలి. కాసేపటికి మిశ్రమం తీగలు తీగలుగా మారుతుంది. ఆ తరువాత సన్నని పూసలుగా మారుతుంది. ఇప్పుడు ఇలా పూసలుగా అయిన మిశ్రమాన్ని ఒక ట్రేలోనికి తీసుకొని అచ్చులా వత్తుకోవాలి. తరువాత దానిపై తరిగిన పిస్తా గింజలు చల్లుకోవాలి. తరువాత మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే సోన్ పాపిడి తినడానికి రెడీ అయినట్లే.