Ganneru Chettu : మనం ఇంటి ఆవరణలో రకరకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో గన్నేరు మొక్క కూడా ఒకటి. రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్కను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. దేవుని పూజలో సైతం ఈ పూలను విరివిరిగా ఉపయోగిస్తారు. దీనిని సంస్కృతంలో కరమీర, హరిప్రియ, గౌరీ పుష్ప అని పిలుస్తారు. గన్నేరు మొక్క చాలా త్వరగా పెరుగుతుంది. మనకు వివిధ రంగుల్లో ఈ గన్నేరు పూలు లభిస్తూ ఉంటాయి. మనకు ఎరుపు, తెలుపు, పింక్, పసుపు రంగుల్లో ఉండే గన్నేరు పూలు లభ్యమవుతాయి. గన్నేరు మొక్క ప్రతి భాగంలో విషం ఉంటుంది కనుక పశువులు ఈ మొక్కను ఆహారంగా తీసుకోవు.
విషం ఉన్నప్పటికి ఈ మొక్కను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారని మనలో చాలా మందికి తెలియదు. ఈ మొక్కను బాహ్య శరీరానికి ఔషధంగా మాత్రమే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి తీసుకోకూడదు. గన్నేరు మొక్కను ఉపయోగించి చర్మ సంబంధిత సమస్యలకు, కీళ్ల వాతానికి, జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తెలుపు లేదా పసుపు రంగులో ఉండే గన్నేరు మొక్క ఆకులను పేస్ట్ గా చేసి నెల రోజుల పాటు చర్మంపై రాయడం వల్ల పేనుకొరకడం వల్ల వచ్చే మచ్చలు తొలగిపోతాయి. తెల్ల గన్నేరు పూలను, నీటితో కలిపి మెత్తగా నూరాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉండే మచ్చలు తొలగిపోతాయి. ఒక గ్లాస్ నీటిలో 10 గ్రాముల గన్నేరు ఆకులను వేసి నాలగోవంతు కషాయం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తలలో కురుపులు, దురదలు, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. గన్నేరు మొక్క వేరును నీటితో ఆరగదీసి ఆ మిశ్రమాన్ని మొలలపై రాస్తూ ఉంటే మొలల త్వరగా తగ్గు ముఖం పడతాయి. అలాగే మనలో కొందరు ఏనుగు చర్మం వంటి ముదురు చర్మాన్ని కలిగి ఉంటారు.
ఈ సమస్యతోమ బాధపడే వారు గన్నేరు చెట్టు బెరడును మెత్తగా నూరి సమస్య ఉన్ ప్రాంతంలో రాయాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి ముదురు చర్మమైనా సున్నితంగా మారుతుంది. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు గన్నేరు ఆకులను నీటిలో వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఈ ఆకులను ఆవనూనెతో కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులపై లేపనంగా రాయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి బొల్లి మచ్చలపై రాయడం వల్ల మచ్చలు తగ్గిపోతాయి.
గన్నేరు ఆకులతో చేసిన కషాయాన్ని ఇంట్లో చల్లుకోవడం వల్ల క్రిమికీటకాలు నశిస్తాయి. ఈ గన్నేరు మొక్కలను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియక ఎవరికైనా ఈ గన్నేరు ఆకుల రసాన్ని లోపలికి తీసుకుంటే వేడి పాలల్లో పసుపు, పటిక బెల్లం కలిపి ఇవ్వాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేయడం వల్ల విషం విరిగిపోతుంది.