Instant Vada : ఉదయం అల్పాహారంలో భాగంగా మనం వడలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మినపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. పిండి రుబ్బే పని లేకుండా కూడా మనం వడలను తయారు చేసుకోవచ్చు. మినపప్పుతో పని లేకుండా రుచిగా వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ వడలు తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె- డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత.
రవ్వ వడలు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో రవ్వను తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే తగినంత ఉప్పును వేసి కలపాలి. నీళ్లు వేడయ్యాక మిక్సీ పట్టుకున్న రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ రవ్వను దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. రవ్వ దగ్గర పడిన తరువాత ఈ నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వను గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ రవ్వలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. తరువాత అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి.
తరువాత చేతులకు నూనె రాసుకుంటూ తగినంత రవ్వను తీసుకుని వడ ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత అందులో వడలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ వడలు తయారవుతాయి. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా ఈవడలను తయారు చేసుకుని తినవచ్చు. టమాట చట్నీ, పల్లి చట్నీ వంటి వాటితో కలిపి తింటే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి.