Roasted Custard Apple : చలికాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో సీతాఫలం ఒకటి. ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతాఫలం మధురమైన రుచిని కలిగి ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఈ పండ్లను తినడం వల్ల మనం సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. సీతాఫలంలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నశింపజేయడంలో సహాయపడతాయి. సీతాఫలాలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తినడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఈ సీతాఫలాలకు ఉంది.
వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. యాంటీ క్యాన్సర్ లక్షణాలను కూడా సీతాఫలం కలిగి ఉంటుంది. మలబద్దకం వంటి జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడే వారు సీతాఫలాలను తినడం వల్ల సమస్య నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో వాపులు, నొప్పులను తగ్గించడంలో కూడా ఈ పండు మనకు ఎంతగానో సహాయపడుతుంది. సీతాఫలం గుజ్జును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
సాధారణంగా వీటిని మనం పూర్తిగా పండిన తరువాతే తింటాం. అలా తింటేనే ఇవి రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సీతాఫలాలను మనం మంటలో కాల్చుకుని కూడా తినవచ్చు. పూర్వకాలంలో ఎక్కువగా ఇలానే తినేవారు. ప్రస్తుత కాలం వారికి వీటిని కాల్చుకుని తినవచ్చన్న సంగతే తెలియదు. మంటలో కాల్చిన సీతాఫలాలు కూడా చాలా చక్కటి రుచిని కలిగి ఉంటాయి. వీటిని కాల్చడం కూడా సులభం. దీని కోసం పచ్చిగా ఉన్న సీతాఫలాలను సేకరించాలి. తరువాత ఎండుకట్టెలను తీసుకుని కుప్పగా పేర్చి మంట పెట్టాలి. ఈ మంటలో సీతాఫలాలను వేయాలి. తరువాత ఈ సీతాఫలాలపై మరికొన్ని కట్టెలను ఉంచాలి.
మంట బాగా వచ్చేలా చూసుకోవాలి. ఇలా కాల్చడం వల్ల సీతాఫలం పైభాగం మాడిపోయినట్టుగా అవుతుంది. లోపల భాగం ఉడికి మెత్తబడుతుంది. సీతాఫలం మెత్తబడిన తరువాత మంట నుండి తీసుకుని తినాలి. వీటిని కాల్చడానికి అరగంట నుండి గంట సమయం పడుతుంది. ఇలా కాల్చిన సీతాఫలాలు తియ్యగా, వగరుగా చక్కటి రుచిని కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా ఇలా కాల్చుకుని తినవచ్చు. సీతాఫలాలు దొరికిన కాలంలో వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.