Bellam Gavvalu : మనం పండగల సమయంలో రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో గవ్వలు కూడా ఒకటి. ఈ గవ్వలు చక్కటి రుచితో నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటాయి. ఈ గవ్వలను తయారు చేయడానికి ఎక్కువగా మనం మైదా పిండిని, పంచదారను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని ఉపయోగించి చేయడం వల్ల గవ్వలు రుచిగా ఉన్నప్పటికి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆరోగ్యానికి హాని కలగకుండా అలాగే రుచిగా ఉండేలా కూడా వీటిని మనం తయారు చేసుకోవచ్చు. గవ్వలను ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకందాం.
గవ్వల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 200 గ్రా., బెల్లం – 200 గ్రా., బొంబాయి రవ్వ – 50 గ్రా., బటర్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గవ్వల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి. తరువాత అందులో బొంబాయి రవ్వ, ఉప్పు, కరిగించిన బటర్ ను వేసి బాగా కలపాలి. తరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత పిండిపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత పిండిని మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు పిండిని తీసుకుని చిన్న చిన్న గుండ్రటి ఉండల్లా చేసుకోవాలి. తరువాత గవ్వల చెక్కను తీసుకుని దానికి కొద్దిగా నూనెను రాయాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని గవ్వల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా గవ్వలన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత గవ్వలను వేసి వేయించుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో బెల్లం, ఒక టీ గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి లేత తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉడికించాలి. బెల్లం తీగ పాకం వచ్చిన తరువాత దానిలో ముందుగా వేయించిన గవ్వలను వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి గవ్వలను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం గవ్వలు తయారవుతాయి. స్నాక్స్ గా ఇలా గవ్వలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ గవ్వలను తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.