Instant Ullipaya Bondalu : మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయలు కూడా ఒకటి. ఇవి ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటాయి. ఉల్లిపాయలు లేనిదే మనం వంట కూడా చేయము. అంతగా మన వంటల్లో ఉల్లిపాయలు భాగమై పోయాయి. వంటల్లోనే కాకుండా ఉల్లిపాయలతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఉల్లిపాయ బోండా కూడా ఒకటి. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ ఉల్లిపాయ బోండాలను అప్పటికప్పుడు రుచిగా ఎలా తయారు చేసుకోవాలి…. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ ఉల్లిపాయ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 3, మైదా పిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, పెరుగు – అర కప్పు, బంగాళాదుంప – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా , తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ.
ఇన్ స్టాంట్ ఉల్లిపాయ బోండా తయారీ విధానం..
ముందుగా మిక్సీలో బంగాళాదుంపను వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత గిన్నెలో పెరుగును వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ పెరుగులో మిక్సీ పట్టుకున్న బంగాళాదుంప పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత అందులో మైదాపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మరీ పలుచగా కాకుండా 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వంటసోడా వేసి కలుపుకోవాలి. తరువాత ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తగినంత పిండిని తీసుకుంటూ బోండాలుగా వేసుకోవాలి. వీటిని దూరం దూరంగా ఒక దానికి ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి. ఈ బోండాలను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ బోండాలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో ఇలా ఉల్లిపాయలతో బోండాలను వేసుకుని తినవచ్చు. ఈ బోండాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.