Rice Storage : అన్నం మనకు ఎననో ఏళ్లుగా ప్రధాన ఆహారంగా ఉంటూ వస్తుంది. బియ్యాన్ని ఉడికించి మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని చాలా మంది నిత్యవసర సరుకులతో పాటు కొనుకోలు చేస్తారు. కొందరు ఆరు నెలలకు, సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. అయితే పాత బియ్యం, కొత్త బియ్యం అనే తేడా లేకుండా బియ్యానికి పురుగు పట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి బియ్యానికి పురుగు పడుతూ ఉంటుంది. పురుగు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేయడం చాలా కష్టం. ఇలా బియ్యం పురుగు పట్టకుండా వీటిలో రసాయనాలు కలిగిన పొడులను కలుపుతూ ఉంటారు.
పురుగు పట్టిన బియ్యాన్ని లేదా ఇలా రసాయనాలు కలిపిన బియ్యాన్ని వండుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక సహజ సిద్ద పద్దతులను ఉపయోగించి బియ్యాన్ని నిల్వ చేసుకోవడం ఉత్తమం. బియ్యానికి పురుగు పట్టకుండా చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాలను పాటించడం వల్ల బియ్యంలో ఉండే పురుగులు కూడా తొలగిపోతాయి. బియ్యాన్ని డబ్బాలో నిల్వ చేసుకునేటప్పుడు ఆ బియ్యంలో రెండు లేదా మూడు ఎండు మిరపకాయలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే బియ్యంలో వెల్లుల్లి పాయను లేదా వెల్లుల్లి రెబ్బలను ఉంచడం వల్ల కూడా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
అలాగే బియ్యంలో వేపాకులను ఉంచి బియ్యాన్ని నిల్వ చేసుకోవడం వల్ల కూడా బియ్యం పురుగు పట్టకుండా ఉండడంతో పాటు బియ్యంలో ఉన్న పురుగులు తొలగిపోతాయి. బియ్యం డబ్బాలను లేదా పప్పు డబ్బాలను కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కూడా వీటిలో ఉండే పురుగులు నశిస్తాయి. తరువాత బియ్యాన్ని అలాగే పప్పులను శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒక జార్ లో వేపాకులను, వెల్లుల్లి రెబ్బలను, మిరియాలను, లవంగాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఈ ఉండలను ఎండలో ఉంచి పూర్తిగా ఆరే వరకు ఎండనివ్వాలి.
ఇలా తయారు చేసుకున్న ఉండలను రెండింటిని తీసుకుని బియ్యం డబ్బాలో ఉంచి డబ్బా మూతను తీసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో ఉన్న పురుగులు బయటకు పోతాయి. ఒక గంట తరువాత ఈ ఉండలను తీసి వేయవచ్చు లేదా అలాగే ఉంచవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉండడంతో పాటు బియ్యంలో ఉన్న పురుగులు కూడా తొలిగిపోతాయి.