Challa Uppidi Pindi : పెరుగుతో మజ్జిగను తయారు చేసి మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మజ్జిగను తీసుకోవడం వల్ల అందులోనూ పుల్లటి మజ్జిగను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, శరీరానికి చలువ చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. వివిధ రకాల వంటల్లో కూడా మనం మజ్జిగను ఉపయోగిస్తూ ఉంటారు. మజ్జిగతో చేసుకోదగిన వంటల్లో చల్ల ఉప్పిడి పిండి ఒకటి. ఈ వంటకం గురించి చాలా మందికి తెలియకపోయినప్పటికి ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఉప్పిడి పిండిని తయారు చేయడం కూడా చాలా సులభం. మజ్జిగతో ఉప్పిడి పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చల్ల ఉప్పిడి పిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం రవ్వ – ఒక గ్లాస్, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 5, కరివేపాకు – రెండు రెమ్మలు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పుల్లటి మజ్జిగ – రెండు గ్లాసులు, ఉప్పు – తగినంత.
చల్ల ఉప్పిడి పిండి తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యం రవ్వను తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, శనగలు, ఆవాలు వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి అన్నీ చక్కగా వేగిన తరువాత మజ్జిగ పోసి మరిగించాలి. మజ్జిగ బాగా మరిగిన తరువాత బియ్యం రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కుక్కర్ పై మూతను ఉంచి పెద్ద మంటపై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
తరువాత అంతా కలిసేలా బాగా కలుపుకుని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చల్ల ఉప్పిడి పిండి తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చల్ల ఉప్పిడి పిండిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీనిని ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తయారు చేసుకుని తినవచ్చు.