Pistha : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పశ్చిమ ఆసియా దేశాల నుండి పిస్తా మనకు ఎక్కువగా దిగుమతి అవుతుంది. పిస్తా పప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని అమితంగా ఇష్టపడతారు. పిస్తా పప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరాన్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో పిస్తా మనకు ఉపయోగపడుతుంది. పిస్తాను రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఒత్తిడి నుండి కాపాడుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో పిస్తా మనకు సహాయపడుతుంది.
పిస్తాను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా తయారవుతుంది. ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్యాన్ని మృదువుగా కాంతివంతంగా తయారు చేస్తాయి. పిస్తా పప్పు చర్మానికి ఒక మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. చర్మం పై ఉండే ముడతలను తొలగించి వృద్ధాప్య ఛాయలను మన దరి చేరకుండా చేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి పిస్తా ఒక వరమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ బి6 రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
అలాగే దీనిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పిస్తాను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, ఆమైనో ఆమ్లాలు అందుతాయి. మధుమేహంతో బాధపడే వారికి పిస్తా పప్పు ఎంతో మేలు చేస్తుంది. పిస్తాను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పిస్తాను కొద్దిగా తీసుకుంటేనే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటాం. అలా పిస్తాలో శరీరానికి హాని చేసే కొవ్వు పదార్థాలు ఏమాత్రం ఉండవు. అందువల్ల అధిక బరువు సమస్యలతో బాధపడే వారు పిస్తాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పిస్తాను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, ధృడంగా పెరుగుతుంది. కంటి ఆరోగ్యాన్ని అలాగే జీర్ణశక్తిని పెంచడంలో పిస్తా పప్పు మనకు ఎంతో దోహదపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. దీంతో మనం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. తరచూ అనారోగ్య సమస్యల బారిన పడే వారు, అలాగే నీరసంగా, బలహీనంగా ఉండే వారు పిస్తాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిస్తా పప్పును ప్రతిరోజూ మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.