Chinthapandu Pachadi : మనం వంటల్లో పులుపు రుచి కొరకు చింతపండును వాడుతూ ఉంటాం. చింతపండును ఉపయోగించని వారు ఉండరనే చెప్పవచ్చు. పులుసు కూరల్లో, సాంబార్, పప్పు చారు వంటి వాటిని తయారు చేయడానికి ఈ చింతపండును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవే కాకుండా చింతపండుతో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచ్ లర్స్ కూడా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. రుచిగా ఉండడంతో పాటు త్వరగా అయ్యే ఈ చింతపండు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఎండుమిర్చి – 15 నుండి 20, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – కొద్దిగా.
చింతపండు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండు మిర్చి వేసి మరీ నల్లగా కాకుండా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకుని చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో వేయించిన ఎండుమిర్చి, వేయించిన ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత చింతపండును నీటితో సహా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిలో నీళ్లు సరిపోకపోతే కొద్దిగా గోరు వెచ్చని నీటిని పోసుకుని మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతపండు పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దోశ, ఊతప్పం వంటి వాటితో కూడా ఈ పచ్చడిని తినవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చింతపండుతో పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు.