Instant Sabudana Dosa : మనం ఆహారంగా సగ్గుబియ్యాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం. సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. సగ్గుబియ్యంతో పాయసం, పునుగులు వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ సగ్గుబియ్యంతో మనం ఇన్ స్టాంట్ గా దోశలను కూడా వేసుకుని తినవచ్చు. సగ్గుబియ్యంతో చేసే ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి. సమయం లేనప్పుడు, టిపిన్ ఏం చేయాలో తోచనపుడు ఇలా సగ్గుబియ్యంతో రుచిగా దోశలను తయారు చేసుకుని తినవచ్చు. సగ్గుబియ్యంతో రుచిగా, సులభంగా అలాగే ఇన్ స్టాంట్ గా దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ సగ్గుబియ్యం దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గుబియ్యం – ఒక కప్పు, బియ్యం – ఒక కప్పు, అల్లం తరుగు – రెండు టీ స్పూన్లు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, పుల్లటి పెరుగు – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – ఒక కట్ట, తరిగిన కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత.
ఇన్ స్టాంట్ సగ్గు బియ్యం దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసి మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అలాగే బియ్యాన్ని కూడా రెండు గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు జార్ లో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకుని, తగినన్ని నీళ్లు పోసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అల్లం తరుగు, పచ్చి తరుగు కూడా జార్ లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పిండి, బియ్యం పిండి, మిక్సీ అల్లం మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో మిగిలిన పదార్థాలన్నింటిని కూడా వేసి బాగా కలపాలి. తరువాత దోశ వేయడానికి వీలుగా ఉండేలా తగినన్ని నీళ్లు కూడా పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు వేసాం కనుక దోశ చక్కగా గుండ్రంగా రాదు. ఇప్పుడూ నూనె వేసుకుంటూ ఈ దోశను రెండు వైపులా రంగు మారే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం దోశలు తయారవుతాయి. ఈ దోశలు వేడిగా ఉంటేనే రుచిగా ఉంటాయి. పల్లి చట్నీ, అల్లం చట్నీలతో కలిపి తింటే సగ్గుబియ్యం దోశలు చాలా రుచిగా ఉంటాయి. సమయం తక్కువగా ఉన్న వారు సగ్గుబియ్యంతో ఇలా ఇన్ స్టాంట్ గా దోశలను వేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.