డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు రోజూ తీసుకునే ఆహారంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. వారు తీసుకునే ఆహారం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కనుక శరీరానికి హితం చేసే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరగడుపునే
రెండు టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత వాటిని తినాలి. అనంతరం గ్లాస్ వేడి నీళ్లు తాగాలి. లేదా అర కప్పు ఉసిరికాయ రసంలో చిటికెడు పసుపు కలుపుకుని తాగాలి. లేదా కాకరకాయ రసాన్ని తాగి అనంతరం వేడి నీళ్లు తీసుకోవాలి.
అల్పాహారం
డయాబెటిస్ ఉన్నవారు ఉదయం అల్పాహారంగా ఉప్మాను తీసుకోవచ్చు. అయితే అది గట్టిగా ఉండకూడదు. జారుడుగా ఉండాలి. కొంచెం నెయ్యితో తయారు చేసిన ఉప్మా అయితే మేలు. అలాగే అటుకులతో చేసే పోహా లేదా ఉడకబెట్టిన కోడిగుడ్లను పచ్చసొన తొలగించి తినవచ్చు. కూరగాయలతో చేసే సూప్‌ను లేదా టమాటా సూప్‌ను తాగవచ్చు. వెన్న తీసిన పాలు, బత్తాయి, క్యారెట్, యాపిల్ లాంటి పండ్లు లేదా వాటి రసాలను తాగవచ్చు.
మధ్యాహ్నం
భోజనం చేసే ముందు కీరదోస, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్ మొదలైన కూరగాయలను పచ్చిగా తినాలి. వాటిని ముక్కలుగా కట్ చేసి తినవచ్చు. గోధుమలతో చేసిన చపాతీలు, కొద్దిగా అన్నం తినవచ్చు. అన్నంతో మెంతులను తీసుకుంటే మంచిది. వేపుళ్లను తినరాదు. పులుసు కూరలు తినవచ్చు. బీన్స్, లేత వంకాయ, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్, టమాటా, సొరకాయ, మునగకాయ, పొట్లకాయ, బెండకాయ, దోసకాయ, బీరకాయ, దొండకాయ తదితర కూరగాయలను కూరగా చేసుకుని తినవచ్చు. అల్లం, వెల్లుల్లి, మెంతులు, జీలకర్రలను భోజనంలో తీసుకోవాలి. ఇక భోజనం అనంతరం పెరుగు కాకుండా మజ్జిగను తీసుకోవాలి. మాంసాహారులు అయితే చేపలు, స్కిన్‌లెస్ చికెన్‌ను కొద్దిగా తీసుకోవచ్చు.
సాయంత్రం స్నాక్స్
అటుకులు లేదా మరమరాలతో మిక్చర్ తయారు చేసుకుని అందులో ఉల్లిపాయలు కలిపి తినవచ్చు. బొప్పాయి, దానిమ్మ, బత్తాయి పండ్లను తినవచ్చు. వెన్న తీసిన పాలలో అశ్వగంధ చూర్ణం, శతావరి చూర్ణంలను కలుపుకుని తాగాలి. కూరగాయల సూప్ లేదా టమాటా సూప్‌ను తాగవచ్చు. చక్కెర కలపకుండా టీ తయారు చేసుకుని తాగవచ్చు. అందులో అల్లం వేస్తే మంచిది. అలాగే నీటిలో నానబెట్టిన ఖర్జూరాలను రసం పిండి ఆ రసంలో ఉసిరికాయ రసం కలిపి తాగవచ్చు.
రాత్రి
మధ్యాహ్నం లాగే భోజనం చేయవచ్చు. కానీ తక్కువ ఆహారం తీసుకోవాలి. ఇక రాత్రి నిద్రించే ముందు పలుచని మజ్జిగను తాగాలి.
ఇలా డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఆహారం తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. దీంతోపాటు రోజూ వ్యాయామం చేయడం, వేళకు భోజనం చేయడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం చేయాలి. దీంతో డయాబెటిస్ సులభంగా నియంత్రణలోకి వస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365