Sorakaya Perugu Pachadi : మన శరీరానికి చలువ చేసే కూరగాయల్లో సొరకాయ ఒకటి. దీనితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. తరచూ చేసే కూరలతో పాటు సొరకాయతో మనం పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయతో చేసే ఈ పెరుగు పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. సొరకాయ మరియు పెరుగు ఇవి రెండు కూడా మన శరీరానికి మేలు చేసేవే. సొరకాయ పెరుగు పచ్చడిని సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ ముక్కలు – పావు కిలో, చిలికిన పెరుగు – 200 గ్రా., చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – పావు టీ స్పూన్.
సొరకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయిలో సొరకాయ ముక్కలు, అర గ్లాస్ నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మధ్యస్థ మంటపై సొరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు పది నిమిషాల పాటు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉడికించిన సొరకాయ ముక్కలు, పసుపు వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
తరువాత స్టవ్ ఆఫ్ చేసి సొరకాయ ముక్కలు చల్లారే వరకు అలాగే ఉంచాలి. సొరకాయ ముక్కలు చల్లారిన తరువాత పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొరకాయను ఇష్టపడని వారు కూడా ఈ సొరకాయ పెరుగు పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.