మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం ఎంత అవసరమో, రోగ నిరోధక శక్తి పెరగాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే అవసరం. మనం రోజూ తినే పలు ఆహారాల వల్లే మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక కోవిడ్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న వారు కూడా బలవర్ధకమైన ఆహారాలను తీసుకోవాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి కోవిడ్‌పై వేగంగా పోరాటం చేయవచ్చు. కరోనా నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన వారు రోజూ ఎలాంటి ఆహారాలను తీసుకోవాలనే వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1. కరోనా బారిన పడ్డవారు అన్ని పోషకాలు అందేలా చూసుకోవాలి. అన్ని విటమిన్లు, మినరల్స్ ఆహారాల్లో ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలి. అందుకు గాను రోజూ 5 రకాల పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.
2. రోజూ డార్క్ చాక్లెట్లను స్వల్ప మోతాదులో తీసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. కోవిడ్ వల్ల ఆందోళన చెందకుండా, భయపడకుండా ఉంటారు.
3. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. రోజూ తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలి. అంటే చాలా మంది 3 సార్లు భోజనం చేస్తారు కదా. కానీ 5 సార్లు చేయాలి. ఆహారాన్ని మాత్రం తక్కువగా తీసుకోవాలి. దీంతో జీర్ణవ్యవస్థపై భారం పడకుండా ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
5. రాగులు, జొన్నలు, సజ్జలు, ఇతర చిరు ధాన్యాలను రోజూ తింటే మంచిది. ఆహారంలో ఉదయం ఓట్స్‌ను తినాలి.
6. ప్రోటీన్ల ద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక చికెన్, చేపలు, మటన్, పనీర్, సోయా వంటివి తీసుకోవాలి.
7. బాదంపప్పు, పిస్తాలు వంటి నట్స్‌ను తినాలి. గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవాలి.
8. వంటల్లో ఆలివ్ నూనెను వాడాలి.
ఈ ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల 80 నుంచి 85 శాతం మంది కోవిడ్ బాధితులు ఇండ్లలోనే త్వరగా కోలుకుంటారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365