Mudda Pappu Talimpu : మనం తరచుగా ముద్ద పప్పును తయారు చేస్తూ ఉంటాం. ఈ ముద్ద పప్పులో నెయ్యి వేసి పిల్లలకు ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలాగే ముద్ద పప్పు, అన్నం, పచ్చళ్లను కలిపి తింటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ముద్ద పప్పును తాళింపు వేసి తినవచ్చు. తాళింపు వేసిన ఈ ముద్ద పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో కలిపి తింటే దీనిని తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ముద్ద పప్పును తాళింపు ఎలా వేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్ద పప్పు తాళింపు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 150 గ్రా., చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ఊర మిరపకాయలు – 5, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
ముద్ద పప్పు తాళింపు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత అందులో ఒక గ్లాస్ నీళ్లు, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసి కుక్కర్ మూత పెట్టాలి. తరువాత దీనిని 3 విజిల్స్ వచ్చే వరకు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పును వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఊర మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పప్పులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ముద్ద పప్పు తాళింపు తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.