Murukulu : మనం పండుగలకు రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం ఎక్కువగా తయారు చేసే పిండి వంటకాల్లో మురుకులు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనలో చాలా మంది వీటిని చాలా సులభంగా తయారు చేస్తూ ఉంటారు. ఈ మురుకులను రుచిగా, గుల్లగుల్లగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మురుకుల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – 2 కిలోలు, శనగపప్పు – ముప్పావు కిలో, మినపప్పు – పావు కిలో, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, వాము – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మురుకుల తయారీ విధానం..
బియ్యం, శనగపప్పు, మినపప్పు కలిపి గిర్నిలో పిండిని పట్టించుకోవాలి. తరువాత ఈ పిండిని పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారంతో పాటు వామును నలిపి వేసుకుని కలపాలి. తరువాత అర కప్పు నెయ్యి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ పిండిని చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిపై మూతను లేదా తడిపిన వస్త్రాన్ని ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మురుకుల గొట్టాన్ని తీసుకుని నూనె రాసుకోవాలి. తరువాత దీనిలో తగినంత పిండిని ఉంచి నూనెలో మురుకులను వత్తుకోవాలి.
ఈ మురుకులను మధ్‌యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మురుకులు తయారవుతాయి. పండుగలకు, అలాగే అప్పుడప్పుడూ స్నాక్స్ గా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ మురుకులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట దొరికే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే మురుకులను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.