Meat Products : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. 100 లో 30 నుండి 40 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. గాల్ బ్లాడర్ లో రాళ్ల కారణంగా కొందరిలో విపరీతమైన నొప్పి వస్తుంది. కొందరిలో ఎటువంటి నొప్పి కానీ లక్షణాలు కానీ ఉండవు. అయినప్పటికి వారికి పిత్తాశయంలో రాళ్లు ఉంటాయి. సర్జరీ ద్వారా పిత్తాశయాన్ని తొలగించుకుని ఈ సమస్య నుండి బయట పడుతున్నారు. పిత్తాశయంలో రాళ్లు ఉండడం వల్ల కలిగే అసౌకర్యం కన్నా, అలాగే పిత్తాశయం తొలగించిన తరువాత వచ్చే ఇబ్బందుల కంటే ఈ సమస్య బారిన పడకుండా ఉండడమే ఉత్తమం. అసలు పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయి అన్న కారణాలను తెలుసుకుంటే మనం ఈ సమస్య బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. పిత్తాశయంలో రాళ్లు రావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరిలో శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువగా ఉత్పత్తి అయిన ఈ కొలెస్ట్రాల్ పైత్య రసంలో కలిసి పిత్తాశయంలోకి, ప్రేగుల్లోకి వస్తూ ఉంటుంది. లివర్ నుండి పైత్యరసం తయారైనప్పుడు ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్న వారిలో ఎక్కువ కొలెస్ట్రాల్ తో పైత్య రసం తయారవుతుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ తో పైత్య రసం తయారవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. అలాగే గాల్ బ్లాడర్ లో ఇన్ ప్లామేషన్ కారణంగా, కాలేయంలో ఇన్ ప్లామేషన్ కారణంగా కూడా గాల్ బ్లాడర్ లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా కాలేయం పైత్య రసాన్ని తయారు చేసి గాల్ బ్లాడర్ లో నిల్వ చేసుకుంటుంది. ఇలా నిల్వ చేసుకున్న పైత్య రసం నుండి నీటిని, మినరల్స్ ను పిత్తాశయం ఎక్కువ మోతాదులో గ్రహిస్తుంది. దీంతో పైత్య రసం చిక్కగా తయారయ్యి రాళ్లు ఏర్పడతాయి.
అలాగే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడానికి మరో కారణం ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. ఫైబర్ ను తక్కువగా తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారాల్లో ఉండే ఫ్యాట్ నేరుగా కాలేయంలో చేరుతుంది. దీంతో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే చాలా మంది ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలను, మాంసాహార ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల కాలేయంలోకి ఎక్కువ కొలెస్ట్రాల్ చేరుతుంది. దీంతో బైల్ జ్యూస్ లోకి కొలెస్ట్రాల్ ఎక్కువగా వస్తుంది. దీంతో గాల్ బ్లాడర్ లో రాళ్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే ఊబకాయం వల్ల కూడా కొందరిలో పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా వస్తాయి.
అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పిత్తాశయంలో రాళ్లు తయారవుతాయి. అలాగే హార్మోన్లకు సంబంధించిన మందులను వాడడం, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వంటి కారణాల వల్ల కూడా గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య తలెత్తుతుంది. అలాగూ లివర్ క్యాన్సర్, లివర్ సిరిరోసిస్ వంటి సమస్యల కారణంగా కూడా కొందరిలో పిత్తాశయంలో రాళ్ల సమస్య వస్తుంది. ఈ కారణాల్లో ఏ కారణం చేతనైనా గాల్ బ్లాడర్ లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. కనుక మన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల మనం పిత్తాశయంలో రాళ్ల సమస్య బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.