Gas Trouble Home Remedies : పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. పెద్ద వారే కాకుండా నడి వయస్కులు, యువత కూడా ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారు. పొట్టలో గ్యాస్ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, మలబద్దకం, మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, అజీర్తి, వ్యాయామం లేకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, కడుపు నిండుగా ఉండడం, ఏది తినాలనిపించకపోవడం వంటి వాటిని గ్యాస్ ట్రబుల్ లక్షణాలుగా చెప్పవచ్చు. చాలా మంది ఈ సమస్య నుండి బయట పడడానికి రకరకాల మందులను వాడుతూ ఉంటారు.
వీటిని వాడడం వల్ల సమస్య తగినప్పటికి దీర్ఘకాలం పాటు ఈ మందులను వాడడం వల్ల అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చక్కటి చిట్కాలను వాడడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే భవిష్యత్తులో కూడా ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం వంటివి చేయాలి. అలాగే శరీరానికి తగినంత వ్యాయామం చేస్తూ ఉండాలి. అదే విధంగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. టీ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. మసాలాలు, ఫాస్ట్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. నిల్వ పచ్చళ్లను ఎక్కువగా తీసుకోకూడదు. ధూమపానం, మద్యపానం వంటివి చేయకూడదు.
వీటితో పాటు కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కూడా పొట్టలో గ్యాస్ సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. రోజూ ఉదయం పరగడుపున శొంఠి పొడిని, పాత బెల్లాన్ని సమానంగా తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండను తిని వెంటనే ఒక గ్లాస్ వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక అర టీ స్పూన్ శొంఠి పొడిని, ఒక టీ స్పూన్ ధనియాలను వేసి మరిగించాలి. ఈ నీటిని అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టుకుని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు.
అలాగే ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఒక ఇంచు అల్లం ముక్కను కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ బెల్లాన్ని వేసి కలపాలి. ఈ నీటిని ముప్పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గు ముఖం పడుతుంది. గ్యాస్ సమస్యను తగ్గించే మందులను వాడడానికి బదులుగా ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తూ చక్కటి జీవన విధానాన్ని పాటించడం వల్ల గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.