Cucumber Peel Raita : కీరదోసను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కీరదోస మన శరీరంలో ఉండే వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. అందువల్ల వేసవిలో వీటిని అధికంగా తింటుంటారు. అయితే వాస్తవానికి కీరదోసను మనం ఎప్పుడైనా తినవచ్చు. దీంతో మనకు మేలే జరుగుతుంది. ఇక చాలా మంది కీరదోసపై ఉండే పొట్టును తీసేసి తింటారు. ఇలా చేయరాదు. పొట్టులోనే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే పొట్టును నేరుగా తినలేమని అనుకునేవారు దాంతో రైతా చేసుకోవచ్చు. దీన్ని అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే కీరదోస పొట్టుతో రైతాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కీరదోస పొట్టుతో రైతా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – పెద్ద కప్పు, కీర దోస తొక్కలు – 5 లేదా 6, కొత్తిమీర తరుగు – 2 పెద్ద టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – 2, పచ్చి మిర్చి – 4, ఉప్పు – తగినంత.
కీరదోస పొట్టుతో రైతాను తయారు చేసే విధానం..
చిన్న మిక్సీ జార్‌లో కీరా తొక్కలు, పచ్చి మిరప కాయలు, వెల్లుల్లి రెబ్బలు, రెండు టీస్పూన్ల పెరుగు, చిటికెడు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం పెరుగులో వేసి ఉప్పు, కొత్తిమీర జత చేసి బాగా కలపాలి. టేస్టీ కీరా తొక్కల రైతా రెడీ అవుతుంది. అయితే ఇది పలుచగా కావాలంటే కాసిన్ని నీళ్లను కలుపుకోవచ్చు. దీంతో కీరదోస పొట్టు రైతా రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో తినవచ్చు. లేదా నేరుగా తాగవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.