Energy Chikki : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. ఈ ఔషధాన్ని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక కప్పు గోంద్ ను వేసి కలుపుతూ వేడి చేయాలి. గోంద్ వేడయ్యి పొంగిన తరవాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి.
ఇప్పుడు కళాయిలో మరో టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఒక కప్పు బాదం పప్పును వేసి వేయించాలి. బాదం పప్పు చక్కగా వేగిన తరువాత వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఇదే కళాయిలో 12 ఎండు ఖర్జూరాలను వేసి వేయించాలి. ఖర్జూరాలు వేగి మెత్తబడిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని దంచి వాటిలో ఉండే గింజలను తీసి వేయాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి. తరువాత ఇందులో మూడు ఎండు అంజీరాలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో ఒక కప్పు ఎండు నల్ల ద్రాక్షలను, ఒక కప్పు ఎండు ద్రాక్షలను వేసుకోవాలి. తరువాత ఇందులో అర కప్పు మునక్కాను వేసుకోవాలి. తరువాత వేయించిన బాదం పప్పు, గోంద్ వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు ఒక కళాయిలో ఒక కప్పు బెల్లం, 4 టీ స్పూన్ల పంచదార, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. దీనిని బెల్లం కరిగే వరకు వేడి చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో 4 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక అర కప్పు గోధుమపిండి వేసి కలపాలి. గోధుమపిండి వేగి మెత్తగా ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఇందులో 2 టీ స్పూన్ గసగసాలు వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత అర కప్ప ఎండు కొబ్బరి తురుము వేసి అర నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. అంతా కలిసిన తరువాత ముందుగా కరిగించిన బెల్లాన్ని వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిని చిక్కీలా లేదా లడ్డూలా వత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చిక్కీలను లేదా లడ్డూలను పాలతో కలిపి తీసుకోవాలి. వీటిని పిల్లల నుండి ముసలివారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా వీటిని తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న చిక్కీలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జలుబు వంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉపయోగించిన గోంద్, మునక్కా మనకు ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. ఈ విధంగా చిక్కీలను తయారు చేసుకుని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.