Shanagala Thalimpu : మనం శనగలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. శనగలను తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడకుండా ఉంటాము. ఇవే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం శనగల ద్వారా పొందవచ్చు. శనగలతో కూరలే కాకుండా గుగ్గిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. శనగ గుగ్గిళ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే శనగ గుగ్గిళ్లను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగ గుగ్గిళ్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగలు – ఒక కప్పు, నూనె – ఒకర టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు.
శనగ గుగ్గిళ్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని ఒక కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ శనగలను 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తాళింపు దినుసులు వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన శనగలు, ఉప్పు వేసి కలపాలి. శనగల్లో ఉండే తడి అంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగ గుగ్గిళ్లు తయారవుతాయి. వీటిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసుకుని కూడా తినవచ్చు. సాయంత్రం సమయాల్లో ఈ విధంగా శనగ గుగ్గిళ్లను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి హానిని కలిగించే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా శనగ గుగ్గిళ్లను తయారు చేసుకుని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.