Ponnaganti Aku Karam Podi : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఇతర ఆకుకూరల కంటే దీని వాడకం తక్కువగా ఉన్నప్పటికి పొన్నగంటి కూర మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కంటి చూపును మెరుగుపరచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా ఈ ఆకుకూర మనకు ఉపయోగపడుతుంది. పొన్నగంటి కూరతో మనం ఎంతో రుచిగా ఉండే కూరలనే కాకుండా కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కారం పొడిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొన్నగంటి ఆకుకూరతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొన్నగంటాకు కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పొన్నగంటి ఆకు కట్టలు – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 20, శనగపప్పు – పావు కప్పు, మినపప్పు – పావు కప్పు, ధనియాలు – అర కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, చింతపండు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు – 15.
పొన్నగంటాకు కారం పొడి తయారీ విధానం..
ముందుగా పొన్నగంటి ఆకుకూరను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చిని వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మరలా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆరబెట్టుకున్న పొన్నగంటి ఆకుకూరను వేసి వేయించాలి. ఆకుకూర చక్కగా వేగి పూర్తిగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో ఎండుమిర్చిని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వేయించిన దినుసులు, ఆకుకూర, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొన్నగంటి కూర కారం పొడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ కారం పొడిని తినవచ్చు. ఈ విధంగా పొన్నగంటి కూరతో కారం పొడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.