Bread Rolls : మనం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను పాలు, టీ తో తినడంతో పాటు వీటితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసుకోదగిన చిరుతిళ్లల్లో బ్రెడ్ రోల్స్ ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. బ్రెడ్ రోల్స్ ను తయారు చేయడం కూడా చాలా తేలిక. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బ్రెడ్ తో రుచిగా, సలుభంగా రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 6, ఉడికించిన బంగాళాదుంపలు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత. కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పసుపు – చిటికెడు.
బ్రెడ్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటి అంచులను తీసేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత బ్రెడ్ స్లెస్ ను రెండు వైపులా రెండు సెకన్ల పాటు నీటిలో ముంచి తీయాలి. తరువాత నీరంతా పోయేలా రెండు చేతులతో చిరిగి పోకుండా గట్టిగా వత్తాలి. ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ స్లైస్ పై ముందుగా తయారు చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచాలి.
తరువాత అంచులను నెమ్మదిగా మూసేసి గుండ్రంగా రోల్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రోల్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ రోల్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో బ్రెడ్ తో ఈ విధంగా రోల్స్ ను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.