Fishes : చాలా మంది రుచిగా ఉంటాయని కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల పదార్థాలు రుచిగా ఉన్నప్పటికి మన ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి. వీటిని తిన్న వెంటనే ఎటువంటి ఫలితం లేకపోయినప్పటికి భవిష్యత్తులో అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం విరుద్ద ఆహారాలను తీసుకోకూడదు. విరుద్ద ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు వాపులు, నొప్పులు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి కొన్ని విరుద్ద ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకోకూడని విరుద్ద ఆహారాల్లో పాలు, నిమ్మకాయ ఒకటి. పాలతో నిమ్మకాయ రసాన్ని కలిపితే అవి విరిగిపోతాయన్న సంగతి మనకు తెలిసిందే.
ఇవి పొట్టలోకి వెళ్లిన తరువాత కూడా ఇలాగే విరిగిపోతాయి. ఈ రెండింటిని అస్సలు కలిపి తీసుకోకూడదు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, సైనస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అలర్జీతో పాటు వివిధ రకాల చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఈ రెండింటిని ఒక గంట వ్యవధితో తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరు పాలతో కలిపి ఉప్పు బిస్కెట్లను తింటూ ఉంటారు. పాలతో పంచదారను తప్ప ఏ ఇతర పదార్థాలను కలపకూడదు. అలాగే చాలా మంది కిచిడీలో పాలు పోసి వండుతూ ఉంటారు. ఇలా వండిన కిచిడీని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అచ్చే అవకాశం ఉంది. అలాగే పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి ఆహారాలను కూడా తీసుకోకూడదు. పాలతో కలిపి వేయించిన పదార్థాలను తీసుకోకూడదు.
అదే విధంగా కోడిగుడ్లను, పాలను కూడా కలిపి తీసుకోకూడదు. ఈ రెండింటిలో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల బీపీ పెరగడం, శరీరంలో వాపులు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక కోడిగుడ్లను, చికెన్ ను, చేపలను పాలతో కలిపి తీసుకోకూడదు. వీటిని కలిపి తీ సుకోవడం వల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది. అదే విధంగా పాల ఉత్పత్తులను ముల్లంగితో కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే మినపప్పు, మినపప్పుతో చేసిన ఆహార పదార్థాలను తిన్న తరువాత పాలను తీసుకోకూడదు. అదే విధంగా పండ్లను కూడా ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతోనే తినాలి.
పండ్లను తిన్న తరువాత రెండు గంటల వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే చల్లటి పదార్థాలను, వేడి పదార్థాలను కలిపి తీసుకోకూడదు. అలాగే తేనెను కూడా వేడిగా ఉండే పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. గోరు వెచ్చగా ఉన్న పదార్థాల్లో మాత్రమే తేనెను కలిపి తీసుకోవాలి. తేనెను, వెన్నను కలిపి తీసుకోకూడదు. పెరుగుతో పాటు పుల్లగా ఉండే ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.