Mutton Soup : మనం అప్పుడప్పుడూ మటన్ బోన్స్ తో సూప్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. మటన్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఎముకలు విరిగినప్పుడు, ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు ఈ సూప్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఘాటుగా, రుచిగా మటన్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ బోన్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ బోన్స్ – అరకిలో, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 10, పచ్చిమిర్చి – 3, నీళ్లు – 750 ఎమ్ ఎల్, ఉప్పు – తగినంత, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, మిరియాలు – ఒక టీ స్పూన్, కొత్తిమీర కాడలు – ఒక కట్ట, బిర్యానీ ఆకు – 1, , పసుపు – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ బోన్ సూప్ తయారీ విధానం..
ముందుగా మటన్ బోన్స్ ను శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత రోట్లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా దంచాలి. ఇప్పుడు కుక్కర్ లో మటన్ బోన్స్, నీళ్లు వేసి ఉడికించాలి. మటన్ బోన్స్ ఉడికిన తరువాత కొద్ది సేపటికి వాటిపై తెల్లటి తేట ఏర్పడుతుంది. ఈ తేటను తీసేసి మరలా ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ముందుగా దంచిన అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర కాడలు, మిరియాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి.
తరువాత మరో లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి మరో లీటర్ నీళ్లు పోసి 40 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వెల్లుల్లి ఎర్రగా వేగిన తరువాత శనగపిండి, కారం వేసి పచ్చి వాసన పోయే వరకు చిన్న మంటపై కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత ముందుగా ఉడికించుకున్న సూప్ ను వడకట్టి ముక్కలుగా రాకుండా వేసుకోవాలి. మూలుగ పోయిన బోన్స్ ను తీసేసి మిగిలిన ముక్కలను సూప్ లో వేసి కలుపుకోవాలి.
దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ బోన్ సూప్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా, నిమ్మరసం పిండి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా మటన్ బోన్స్ తో సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.