Semiya Daddojanam : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో ఎక్కువగా పాయసం, సేమియా ఉప్మా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. సేమియాతో ఇవేకాకుండా మనం సేమియా దద్దోజనాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. సేమియా దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా జాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే సేమియా దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా దద్దోజనం తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, పెరుగు – -రెండు కప్పులు, పాలు – అర కప్పు.
సేమియా దద్దోజనం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక సేమియాను వేసి ఉడికించాలి. సేమియా మెత్తగా ఉడికిన తరువాత నీళ్లు పోయేలా పూర్తిగా దానిని వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, మిరియాల పొడి వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఉడికించిన సేమియాలో ఉప్పు వేసి కలపాలి. తరువాత సేమియాను మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పాలు, పెరుగు వేసి కలపాలి. తరువాత తాళింపును వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా దద్దోజనం తయారవుతుంది. దీనిని దేవుడికి నైవేధ్యంగా కూడా సమర్పించవచ్చు. ఈ దద్దోజనాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.