Minapa Sunnundalu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినపప్పు కూడా ఒకటి. మినపప్పులో కూడా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మినపప్పును మనం ఎక్కువగా అల్పాహారాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం అల్పాహారాలే కాకుండా మినపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే సున్నండలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. సున్నండలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే చెప్పవచ్చు. రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే సున్నండలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సున్నండల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినపప్పు – అరకిలో, బెల్లం తురుము – అరకిలో, నెయ్యి – 100 గ్రా..
సున్నండల తయారీ విధానం..
ముందుగా కళాయిలో మినపప్పు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. మినపప్పు పూర్తిగా చల్లారిన తరువాత జార్ లోకి తీసుకుని మనకు నచ్చిన రీతిలో మెత్తగా లేదా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మరో జార్ లో బెల్లం తరుమును వేసి పొడిగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ బెల్లం పొడిని మినపప్పు మిశ్రమంలో వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నెయ్యిని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సున్నండలు తయారవుతాయి. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల చక్కగా బలం పడతారు. వీటిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.