Mutton Haleem : రంజాన్ నెల ఇప్పటికే ప్రారంభమైంది. రంజాన్ అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది హలీమ్. హలీమ్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనకు చికెన్ హలీమ్ తో పాటు మటన్ హలీమ్ కూడా లభిస్తుంది. మటన్ హలీమ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది హలీమ్ ను మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలు పడదు అని భావిస్తూ ఉంటారు. దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎటువంటి వ్రమ లేకుండా చాలా రుచిగా ఈ హలీమ్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మటన్ హలీమ్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ హలీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, గోధుమ రవ్వ – ముప్పావు కప్పు, బియ్యం – 2 టేబుల్ స్పూన్స్, గంటపాటు ఉప్పు నీటిలో నానబెట్టిన బోన్ లెస్ మటన్ – అరకిలో, సాజీరా – ఒక టీ స్పూన్, ఎండిన గులాబీ రేకులు – 2 టేబుల్ స్పూన్స్, తోక మిరియాలు – ఒక టీ స్పూన్, యాలకులు – 5, పత్తర్ ఫూల్ – ఒక టీ స్పూన్, లవంగాలు – 5, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, నల్లయాలక్కాయ – 1, పసుపు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, ఉప్పు -తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్ – 1/3 కప్పు, నీళ్లు – ఒక లీటర్, మిరియాలు – ఒక టీ స్పూన్, పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్, చిలికిన తియ్యటి పెరుగు – అర కప్పు, నెయ్యి – అర కప్పు, వేయించిన జీడిపప్పు – కొద్దిగా.
మటన్ హలీమ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పప్పులను, ఓట్స్ ను, గోధుమ రవ్వను వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో మటన్ ను వేసుకుని వేడి చేయాలి. ఇందులో సాజీరా, గులాబీ రేకులు, తోక మిరియాలు, యాలకులు, పత్తర్ ఫూల్, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నల్ల యాలక్కాయ, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, మిరియాలు వేసి కలపాలి. తరువాత ఇందులో లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి మటన్ ను 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ ముదురుగా ఉంటే 8 నుండి 9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో నానబెట్టుకున్న పప్పులను వేసుకోవాలి.
తరువాత ఇందులో లీటర్నర నీటిని పోసి మధ్యస్థ మంటపై ఉడికించాలి. వీటిని 2 నిమిషాలకొకసారి అడుగు నుండి బాగా కలుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కుక్కర్ మూత తీసి మటన్ మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. మటన్ మెత్తగా ఉడకకపోతే మరిన్ని నీళ్లు పోసి మరలా ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పప్పు గుత్తితో మటన్ ను మెత్తగా చేసుకోవాలి. మటన్ లోని నీరంతా పోయి మటన్ మెత్తగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పప్పులల్లో పుదీనా, కొత్తిమీర, తరిగిన 2 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల ఎండిన గులాబి రేకులు వేసి పప్పు గుత్తితో వీలైనంత మెత్తగా చేసుకోవాలి. తరువాత మెత్తగా చేసుకున్న మటన్ ను వేసి పప్పు గుత్తితో మెత్తగా చేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత ఉప్పు, గరం మసాలా, 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై 2 నిమిషాలకొకసారి పప్పు గుత్తితో అడుగు నుండి కలుపుతూ 10 నిమిషాలకు పైగా ఉడికించాలి. హలీమ్ ఉడుకుపట్టిన తరువాత దానిపై ఏర్పడిన తేటను తీసేయాలి.
ఇలా పది నిమిషాల పాటు ఉడికించిన తరువాత పెరుగు వేసుకోవాలి. పెరుగును వేయగానే మంటను తగ్గించి పెరుగు కలిసేలా కలుపుకోవాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని గిన్నెలోకి తీసుకుని దానిపై జీడిపప్పును, ఫ్రైడ్ ఆనియన్స్ ను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హలీమ్ తయారవుతుంది. గులాబీ రేకులు లేని వారు ఇందులో రోజ్ వాటర్ ను వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన హలీమ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు.