Kaju Chicken Pakoda : చికెన్ తో మనం రకరకాల వంటకాలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోదగిన చిరుతిళ్లల్లో కాజు చికెన్ పకోడి కూడా ఒకటి. చికెన్ పకోడి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా సాయంత్రం సమయంలో బండ్ల మీద లభిస్తూ ఉంటుంది. ఈ కాజు చికెన్ పకోడీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రాజమండ్రి స్పెషల్ అయిన ఈ కాజు చికెన్ పకోడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు చికెన్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అర కిలో, నిమ్మకాయ – 1, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెబ్బలు, బీట్ చేసిన కోడిగుడ్డు – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు పలుకులు – అర కప్పు, నూనె – డీప్ ప్రైకు సరిపడా, తరిగిన పచ్చిమిర్చి – 5.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కారం గల పచ్చిమిర్చి – 6, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ముప్పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్.
కాజు చికెన్ పకోడి తయారీ విధానం..
ముందుగా జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత చికెన్ ను ముప్పావు ఇంచు మందంతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ చిన్నగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, కరివేపాకు, కోడిగుడ్డు వేసి బాగా కలపాలి. తరువాత దీనిని రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత చికెన్ ను బయటకు తీసి అందులో కొత్తిమీర, మైదాపిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ లో నీళ్లు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ చికెన్ లో నీళ్లు ఉంటే కార్న్ ఫ్లోర్ లేదా మైదాపిండిని మరింత వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చికెన్ లో జీడిపప్పును వేసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక చికెన్ మధ్యలో జీడిపప్పును ఉంచి ముక్కను మడిచి నూనెలో వేసుకోవాలి. ఇలా పావు కిలో చికెన్ ను వేసుకున్న తరువాత చికెన్ ను మధ్యస్థ మంటపై 12 నిమిషాల పాటు కదిలించకుండా వేయించాలి. 12 నిమిషాల తరువాత మంటను పెద్దగా చేసి క్రిస్పీగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన చికెన్ ను కూడా వేయించుకోవాలి. చివరగా అదే నూనెలో పచ్చిమిర్చిని, కరివేపాకును వేసి కరకరలాడే వరకు వేయించుకుని చికెన్ లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ పకోడి తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో అప్పుడప్పుడూ ఇలా పకోడీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.