Paper Chicken : చికెన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలిసిందే. చికెన్ లో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. వ్యాయామాలు చేసేవారు, ఆటలు ఆడే వారు చికెన్ ను తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అయితే చికెన్ ను వండేటప్పుడు మనలో చాలా మంది ఎక్కువగా నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ నూనెను ఉపయోగించి చేసే చికెన్ ను తినడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. అయితే మన ఆరోగ్యానికి మేలు చేసేలా ఒక్క చుక్క నూనెను వాడకుండా కూడా మనం చికెన్ ను తయారు చేసుకోవచ్చు. పేపర్ ఉపయోగించి చేసే ఈ చికెన్ రుచిగా ఉండడంతో పాటు పైన కరకరలాడుతూ చాలా చక్కగా ఉంటుంది. వ్యాయామం చేసే వారు, నూనెను ఇష్టపడని వారు ఇలా పేపర్ చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు. రుచిగా, కమ్మగా నూనె ఉపయోగించకుండా చికెన్ ను ఎలా తయారు చే\సుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పేపర్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ లెగ్ పీసెస్ – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, చిలికిన పెరుగు – అర కప్పు, నిమ్మరసం – అర చెక్క, చికెన్ మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – రెండు టీ స్పూన్స్, అల్లం పొడి – పావు టీ స్పూన్, వెల్లుల్లి పొడి – పావు టీ స్పూన్.

పేపర్ చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ను తీసుకుని వాటిని ఒక వైపు నిలువుగా కట్ చేసుకోవాలి. తరువాత మరో వైపు లోపలి వరకు గాట్లు పెట్టుకోవాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు, నిమ్మరసం, చికెన్ మసాలా వేసి కలపాలి. తరువాత ఇందులో చికెన్ ముక్కలను వేసి ఈ మిశ్రమాన్ని ముక్కలకు బాగా పట్టించాలి. తరువాత వీటిని ఫ్రిజ్ లో రెండు గంటల పాటు ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత ముక్కలను బయటకు తీసి చల్లదనం పోయే వరకు అర గంట పాటు బయట ఉంచాలి. తరువాత ఒక ప్లేట్ లో ఉప్పు, కారం, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని మ్యారినేట్ చేసుకున్న ముక్కలకు పట్టించాలి. తరువాత కళాయిలో రెండు బటర్ పేపర్ లను ఉంచాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను ఉంచి వాటిపై మరో బటర్ పేపర్ ను ఉంచాలి. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా కళాయిపై మూతను ఉంచాలి. ఇప్పుడు ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి ముక్కలను మరో వైపుకు తిప్పి వాటిపై పేపర్ ను ఉంచాలి. ఇప్పుడు నీరంతా పోయే వరకు చిన్న మంటపై మూత పెట్టకుండా ముక్కలను వేయించాలి. ఇలా నీరంతా పోయి ముక్కలు మెత్తగా ఉడకడానికి 25 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది.
ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ఒక్కో ముక్కను తీసుకుని నేరుగా మంటపై ఉంచి చుట్టు కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ తయారవుతుంది. ఈ చికెన్ రుచిగా, కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా కూడా మనం రుచికరమైన చికెన్ ను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన చికెన్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.