Appadalu : మనం పప్పు, సాంబార్, రసం వంటి వాటిలోకి అప్పడాలను తింటూ ఉంటాం. అప్పడాలతో కలిపి తింటే ఇవి ప్పు, సాంబార్ వంటివి మరింత రుచిగా ఉంటాయి. మనకు సాధారణంగా అనేక రుచుల్లో ఈ అప్పడాలు లభిస్తూ ఉంటాయి. బయట కొనుగోలు చేసే పనిలేకుండా ఈ అప్పడాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అటుకులతో చేసే ఈ అప్పడాలు చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. అటుకులతో రుచిగా అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పడాల తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ఒక పెద్ద కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, వాము పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పాపడ్ కార్ – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్.
అప్పడాల తయారీ విధానం..
ముందుగా అటుకులను కళాయిలో వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వాటిని జార్ లో పోసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని జల్లించి ఒక కప్పు మోతాదులో తీసుకుని మిగిలిన పొడిని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, కారం, నూనె, వాము పొడి, జీలకర్ర పొడి , పాపడ్ కార్ వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత అటుకుల పొడి వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అంతాకలిసేలా బాగా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి అటుకుల పొడి చల్లుకుంటూ చపాతీ కర్రతో అప్పడంగా వత్తుకోవాలి. ఇవి గుండ్రంగా రావడానికి చుట్టూ ఉండే అంచులను కట్ చేసుకోవాలి. తరువాత వీటిని ఎండలో రోజంతా ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల అప్పడాలు తయారవుతాయి. వీటిని వేయించడానికి కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అప్పడాలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే అప్పడాలు తయారవుతాయి. వీటిని పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.