Chettinad Fish Fry : ఆరోగ్యకరమైన నాన్ వెజ్ ఫుడ్స్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి చేపలే. చికెన్, మటన్ కన్నా చేపలు ఎంతో ఆరోగ్యకరమైనవని వైద్య నిపుణులు చెబుతుంటారు. వారంలో కనీసం రెండు మూడు సార్లు చేపలను తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుందంటారు. చేపల వల్ల మన శరీరానికి కావల్సిన ఎన్నో మినరల్స్, విటమిన్లు లభిస్తాయి. అయితే చేపలను చాలా మంది వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. కానీ కింద చెప్పిన విధంగా ఒక్కసారి ఫ్రై రూపంలో వెరైటీగా వండి తినండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు. ఈ క్రమంలోనే చెట్టినాడ్ ఫిష్ ఫ్రై ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టినాడ్ ఫిష్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – 4, నూనె – సరిపడా, వెల్లుల్లి రెబ్బలు – 7, అల్లం ముక్క – చిన్నది, జీలకర్ర – ఒక టీస్పూన్, సోంపు – ఒక టీస్పూన్, ధనియాలు – 2 టీస్పూన్లు, నల్ల మిరియాలు – 2 టీస్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, టమాటా – 1, కారం – 1 టీస్పూన్, పసుపు – 2 టీస్పూన్లు, చింత పండు – చిన్న నిమ్మకాయ పరిమాణం, మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
చెట్టినాడ్ ఫిష్ ఫ్రై తయారు చేసే విధానం..
చేపముక్కలను ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడగాలి. చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసి అందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. కొద్దిగా ఉప్పు, టమాటా ముక్కలు వేయాలి. వేగిన తర్వాత పసుపు, కారం వేసి వేయాలి. ఆ తర్వాత చింతపండు రసం పోయాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలపై పోయాలి. దీనిపైన మొక్కజొన్న పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చేపముక్కలను పావుగంటపాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్లో నూనె వేసి చేపముక్కలను వేయించాలి. ఈ ముక్కలను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నిమ్మరసం పిండి వేడివేడిగా తింటే రుచికరంగా ఉంటాయి.