Egg Khuska Biryani : మనం వంటింట్లో రకరకాల రుచుల్లో బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది బిర్యానీని ఇష్టంగా తిన్నప్పటికి దీనిని తయారు చేయడం శ్రమతో కూడుకున్న పని అని భావిస్తూ ఉంటారు. కానీ మనం సులభంగా చేసుకోదగిన బిర్యానీలు కూడా చాలా ఉంటాయి. వాటిల్లో ఎగ్ కుస్కా బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అలాగే ఎక్కువగా సమయం కూడా పట్టదు. సలుభంగా, అలాగే ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ కుస్కా బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ కుస్కా బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అర గంటపాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – అరకిలో, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన టమాటాలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – 3 గ్లాసులు, ఉడికించిన కోడిగుడ్లు – 6,కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చిమిర్చి – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, జాపత్రి – కొద్దిగా, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 12, పచ్చిమిర్చి – 4, పుదీనా ఆకులు – గుప్పెడు, కొత్తిమీర – గుప్పెడు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, చిన్న ముక్కలుగా తరిగిన టమాట – పెద్దది ఒకటి, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్.
ఎగ్ కుస్కా బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే పెరుగు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, సాజీరా, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు కలుపుతూ వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత బియ్యం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని కొద్దిగా వేయించిన తరువాత కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుని వేసుకోవాలి.
తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి గుడ్లు కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి. తరువాత కుక్కర్ మూత తీసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తరువాత వేయించిన కోడిగుడ్లను వేసి కొత్తిమీర చల్లుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ కుస్కా బిర్యానీ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా మసాలా కూరలతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో ఇలా సులభంగా ఎగ్ కుస్కా బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు.