Jonna Ambali : జొన్న అంబలి.. జొన్న పిండితో చేసే ఈ అంబలి చాలా బలవర్దకమైన ఆహారమనే చెప్పవచ్చు. ఈ అంబలిని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. శరీరానికి కావల్సిన ఎన్నో ముఖ్యమైన పోషకాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ అంబలిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎవరైనా ఈ అంబలిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. జొన్నపిండితో అంబలిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న అంబలి తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 5 కప్పులు, జొన్న పిండి – ఒక కప్పు, మజ్జిగ – అర లీటర్, ఉప్పు – తగినంత.
జొన్న అంబలి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో 2 కప్పుల నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. తరువాత మరో గిన్నెలో 5 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని వేసుకోవాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి కలుపుతూ చల్లారనివ్వాలి. తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. మట్టి పాత్రలు అందుబాటులో ఉన్న వారు ఈ అంబలిని మట్టిపాత్రలో పోసి పులియబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా పులిసిన తరువాత అంబలి గట్టిగా తయారవుతుంది.
దీనిని మరోసారి ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మజ్జిగ పోసి కలపాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఈ అంబలిని గ్లాస్ లో పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చితో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న అంబలి తయారవుతుంది. వేసవికాలంలో దీనిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసం బారిన పడకుండా ఉంటాము. ఈ అంబలిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేసవికాలంలో ఇలా జొన్న పిండితో అంబలిని తయారు చేసుకుని తాగడం వల్ల మరింత మంచి ఫలితం కలుగుతుంది.