Allam Pachadi : మనకు టిఫిన్ సెంటర్లలో వడ్డించే చట్నీలలో అల్లం చట్నీ కూడా ఒకటి. అల్లం చట్నీ తియ్యగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. అల్లం పచ్చడిని ఏ టిఫిన్ తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ టిఫిన్ సెంటర్లలో లించే ఈ అల్లం పచ్చడిని మనం అదే రుచితో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేయవచ్చు. టిఫిన్ సెంటర్ స్టైల్ అల్లం పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – 60 గ్రా., చింతపండు – 5ం గ్రా., బెల్లం తురుము – 200 గ్రా., శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 15, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 10.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్,జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
అల్లం పచ్చడి తయారీ విధానం..
ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత చింతపండును శుభ్రపరుచుకుని బాగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పావు లీటర్ నీళ్లు ఈ చింతపండును ఉడికించాలి. నీళ్లు అన్ని పోయి చింతపండు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో గిన్నెలో బెల్లం తురుము, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో శనగపప్పు,జీలకర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత అల్లం ముక్కలు కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత జార్ లో వేయించిన శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. తరువాత అల్లం, ఎండుమిర్చి వేసుకోవాలి.
ఇందులోనే తగినంత ఉప్పును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత మూత తీసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగించిన నీటిని పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి తాళింపును చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి తయారవుతుంది. దీనిని టిఫిన్స్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.