Chalimidi : చలిమిడి.. బియ్యం పిండితో చేసే సాంప్రదాయ రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. తెలుగు ఇళ్లల్లో దాదాపు ప్రతి శుభకార్యానికి దీనిని తయారు చేస్తూ ఉంటారు. బెల్లంతో పాటు పంచదారతో కూడా ఈ చలిమిడిని తయారు చేస్తూ ఉంటారు. అయితే బెల్లంతో చేసే చలిమిడిని తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీనిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ చలిమిడిని బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చలిమిడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – 2 గ్లాసులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, బెల్లం – ముప్పావు గ్లాస్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు – అరకప్పు, జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్స్.
చలిమిడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత బియ్యాన్ని మరోసారి శుభ్రంగా కడిగి కాటన్ వస్త్రంలో వేసి ఎక్కువగా ఉండే నీరంతా పోయే వరకు ఉంచాలి. తరువాత ఈ బియ్యాన్ని ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి బరకగా లేకుండా జల్లెడతో జల్లించి మెత్తని పిండిని తీసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి వేయించి చక్కగా వేయించి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో బెల్లం తురుమును తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం తురుము మునిగే వరకు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి తీగపాకం వచ్చే వరకు దీనిని వేడి చేయాలి.
బెల్లం పాకం ఉడికిన తరువాత కొద్దిగా తీసుకుని నీటిలో వేసి చూడాలి. ఈ పాకం మెత్తని ఉండలా దగ్గరికి రావాలి. ఇలా బెల్లం తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో యాలకుల పొడి, వేయించిన కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. తరువాత జల్లించిన బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. పిండిని అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చలిమిడి మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చలిమిడి తయారవుతుంది. దీనిని గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఈ చలిమిడిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.