Eye Sight Improvement : కొందరిలో కంటి చూపు పక్క భాగాలలో స్పష్టంగా కనిపించినప్పటికి మధ్య భాగంలో నల్లగా, మసకగా కనిపిస్తుంది. దీనినే మాక్యులర్ డిజెనరేషన్ అంటారు. కనుగుడ్డు వెనుక భాగంలో ఉండేదే మాక్యులా. ఇలా మధ్య భాగంలో నల్లగా, మసకగా కనబడడానికి కారణం మాక్యులాకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడమే. మాక్యులాకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల, రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. దీని వల్ల చక్కగా ఉండే గీతలు కూడా వంకరగా కనిపిస్తాయి. దీని వల్ల కాంతి తక్కువగా ఉన్నప్పుడు కూడా సరిగ్గా కనిపించదు. అలాగే ముఖాలను కూడా గుర్తించకలేకపోతూ ఉంటారు. రంగులను కూడా కనిపెట్టలేకపోతూ ఉంటారు. అక్షరాలు కూడా మసకగా కనిపిస్తాయి. మాక్యులర్ డీజెనరేషన్ సమస్య తలెత్తడానికి వివిధ కారణాలు ఉంటాయి.
ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ వచ్చి మాక్యులాకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో మాక్యులర్ డి జెనరేషన్ అనే సమస్య తలెత్తుతుంది. అలాగే అధిక బరువు కూడా ఈ సమస్యకు మరొక కారణం.కొందరిలో జన్యుపరమైన సమస్యల కారణంగా అలాగే ధూమపానం కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. ఈ మాక్యులర్ డీజెనరేషన్ అనే ఈ సమస్యను మనం సులభంగా తగ్గించుకోవచ్చు. ఎక్కువగా రా ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గు ముఖం పడుతుంది. రోజుకు 400 నుండి 500 మిల్లీ గ్రాముల విటమిన్ సి తీసుకోవాలి. రోజూ రెండు జామకాయలు, భోజనం చేసిన తరువాత పెద్ద ఉసిరికాయను ఎండబెట్టిన ముక్కలను తీసుకోవాలి.
విటమిన్ సి ని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవిసె గింజల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే కంటి చూపును మెరుగుపరచుకోవడానికి, కళ్లకు రక్తసరఫరాను పెంచడానికి లూటిన్, జియోగ్జాంతిన్ అనే పదార్థాలను తీసుకోవాలి. ఇవి రోజుకు 6 నుండి 12 మిల్లీ గ్రాముల మోతాదులో అవసరమవుతాయి. ఇవి రెండు కూడా పాలకూరలో ఎక్కువగా ఉంటాయి. అలాగే పిస్తా పప్పును, క్యారెట్ లను, పచ్చి బఠాణీలను తీసుకోవడం వల్ల కూడా ఈ రెండు పదార్థాలు మనకు అందుతాయి. అలాగే జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలను తినడం వల్ల మనం చాలా సులభంగా మాక్యులర్ డిజెనరేషన్ అనే ఈ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.