Crispy Aloo Fry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటితో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో ఎక్కువగా చేసే వంటకాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందరికి నచ్చేలా అలాగే క్రిస్పీగా ఉండేలా ఈ బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, ఇంగువ -కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
క్రిస్పీ ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని రెండు నుండి మూడు సార్లు బాగా కడగాలి. తరువాత ఉప్పు వేసిన నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని కొద్దిగా పెద్ద మంటపై కలుపుతూ వేయించాలి. ఈ బంగాళాదుంప ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ 8 నుండి 10 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ ఆలూ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో పాటు పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు.ఈ విధంగా చేసిన ఆలూ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.