Musk Melon Fruit Punch : వేసవికాలంలో మనం ఎక్కువగా జ్యూస్ లను, మిల్క్ షేక్ లను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే తరచూ జ్యూస్ లు, మిల్క్ షేక్ లే కాకుండా మనం ఫ్రూట్ పంచ్ ను కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు. తర్బూజతో చేసే ఈ ఫ్రూట్ పంచ్ చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తర్బూజతో ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రూట్ పంచ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మస్క్ మెలన్ ఫ్రూట్ పంచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తర్బూజ – 1, కాచి రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచిన పాలు -ఒక కప్పు, పంచదార – 4 టేబుల్ స్పూన్స్, అరటి పండు ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన తర్బూజ ముక్కలు -అర కప్పు, చిన్నగా తరిగిన ఆపిల్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, ఐస్ క్రీమ్ – ఒక స్కూబ్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, టూటీ ఫ్రూటీ – కొద్దిగా, రూప్ అఫ్జా – ఒక టీ స్పూన్.
మస్క్ మెలన్ ఫ్రూట్ పంచ్ తయారీ విధానం..
ముందుగా తర్బూజను తీసుకుని దాని పై భాగాన్ని గుండ్రంగా కట్ చేసుకోవాలి. తరువాత స్పూన్ తో లోపల ఉండే గింజలను తీసి వేయాలి. తరువాత తర్బూజ లోపల ఉండే గుజ్జును నెమ్మదిగా తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తర్బూజ గుజ్జులో సగం గుజ్జును ముక్కలుగా చేసుకోవాలి. మిగిలిన సగం గుజ్జును జార్ లో వేసుకోవాలి. ఇందులోనే పాలు, పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు కట్ చేసుకున్న తర్బూజ కాయను తీసుకుని ఇందులో తరిగిన తర్బూజ ముక్కలు, అరటి పండు ముక్కలు, ఆపిల్ ముక్కలు వేసుకోవాలి. తరువాత ఒక కప్పు మిక్సీ పట్టుకున్న జ్యూస్ ను పోసుకోవాలి. దీనిపై ఐస్ క్రీమ్ ను వేసుకోవాలి. తరువాత ఈ ఐస్ క్రీమ్ పై డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ని చల్లుకోవాలి. చివరగా రూప్ అఫ్జాను వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మస్క్ మెలన్ ఫ్రూట్ పంచ్ తయారవుతుంది. వేసవికాలంలో దీనిని తీసుకోవడం వల్ల ఎండ నుండి ఉపశమనం లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.