Apple Jam : పిల్లలు ఇష్టంగా తినే వాటిల్లో జామ్ కూడా ఒకటి. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువగా దీనిని బ్రెడ్ తో తీసుకుంటూ ఉంటారు. ఈ జామ్ మనకు వివిధ పండ్ల రుచుల్లో లభిస్తుంది. అలాగే మిక్డ్స్ ఫ్రూట్ జామ్ కూడా లభిస్తుంది. వివిధ రకాల జామ్ వెరైటీలలో ఆపిల్ జామ్ కూడా ఒకటి. ఆపిల్ పండ్లతో చేసే ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ జామ్ ను బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఆపిల్ పండ్లు ఉంటే చాలు ఈ జామ్ ను అరగంటలో తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఆపిల్ జామ్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ జామ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆపిల్ – పావు కిలో, దాల్చిన చెక్క ముక్కలు – 2, పంచదార – ఒక కప్పు, నిమ్మరసం – ఒక టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు.

ఆపిల్ జామ్ తయారీ విధానం..
ముందుగా ఒక ఆపిల్ లను ముక్కలుగా కట్ చేసి లోపల ఉండే గింజలు తీసివేయాలి. తరువాత వీటిని గిన్నెలో వేసి అవి మునిగే వరకు నీటిని పోయాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తబడే వరకు ఉడికించాలి. వీటిని 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఈ ముక్కలను జల్లిగిన్నెలోకి తీసుకోవాలి. తరువాత గంటెతో ఈ ముక్కలను మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆపిల్ గుజ్జు, పిప్పి వేరవుతుంది. ఇప్పుడు ఆపిల్ గుజ్జును కళాయిలోకి తీసుకుని మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించాలి. దీనిని 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత నిమ్మరసం వేసి కలపాలి.
దీనిని జామ్ లాగా గట్టిగా దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత పుడ్ కలర్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆపిల్ జామ్ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఈ ఆపిల్ జామ్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ జామ్ ను బ్రెడ్, చపాతీ, పూరీ వంటి వాటితో పిల్లలకు ఇవ్వవచ్చు.